పొద్దు పడమటదిక్కుకు వంగింది. మూకుట్ల వేసిన పూరి మాదిరిగా సూర్యుడు ఆకాశంలో తేలియాడుతున్నాడు.
భూమక్క గుడిసెముందుకు వచ్చి మొత్తం కలియజూసింది. ఆమె కళ్లలో ఎటువంటి భావం లేదు. నెరిసిన జుట్టు, ముడుతలు పడిన శరీరం, లోతుకు పోయిన కళు్ళ వెరసి ఆమె 60 ఏళ్ళ ముసలి. చెవులకు ఘంటీలు వేల్లాడుతున్నాయి. అవి ఎన్ని సంవత్సరాలనుంచి చెవులు మోస్తున్నాయో తెలియదు గాని బాగా సాగి కిందికి ఊగుతున్నాయి. ఆమె నడుస్తుంటే గుమ్మానికి కట్టిన తోరణాలుగా కదులుతున్నాయి. కొద్దిగా వంగిన నడుము భూమిలోంచి మొలిచిన మొక్క పక్కకు వంగినట్టుగా వుంది. చీరను నడుము చుట్టు తిప్పి లోపలకి చెక్కుకున్నది.
మెల్లిగా నడుచుకుంటూ ఇంటిలోపలికి వెళ్ళింది. ఒక పక్కగా ఉన్న నులక మంచం. దండెంమీద రెండు మూడు వస్త్రాలు, కొన్ని వంట సామానులు ఒక పక్కకు బోర్లించి వున్నాయి. భూమక్క లోపలికి వచ్చి అంత కలియ తిరిగి చూసుకున్నది. వచ్చి నులక మంచంలో కూర్చున్నది. గుడ్డలతో చుట్టిన దిండును సరిగ్గా సర్ది దాని మీద తలుంచి పడుకుంది. ఆమె కళు్ళ దేన్నో చూస్తున్నట్టు అలాగే తెరుచుకుని ఉన్నాయి. ఏవేవో జ్ఞాపకాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమెకు కష్టాలు అలవాటు అయ్యాయో! లేక కష్టాలకు ఆమె అలవాటు అయ్యిందో గాని.. అన్నిటిని ఒక్కలాగే స్వీకరించే గుణం మాత్రం అబ్బింది.
తనకు ఊహ తెలిసిన రోజుల్లో భూమక్క అనే పేరు తనకు ఎందుకు పెట్టారో తెల్సింది. పాలేరుగున్న తన తండ్రికి భూమక్క పుట్టినప్పుడే అర ఎకరం భూమిని అతికష్టం మీద కొనుక్కుని స్వతంత్రంగా బతకడానికి మార్గం చూసుకున్నాడు. అంత అదృష్టం తన బిడ్డ వల్లె కలిగిందని ప్రగాఢమైన విశ్వాసంతో `భూమక్క' అని పేరు పెట్టుకున్నాడు. భూమక్కను, అరఎకరం భూమిని ప్రాణప్రదంగా చూసుకున్నాడు. ఉన్న ఒక్క కూతురును సుఖంగా బతకాలని కష్టం మీద తహతుకు మించిన సంబంధమే తెచ్చాడు. పెళ్ళికి తన అర ఎకురం యిచ్చేశాడు.
``ఉన్న భూమి అప్పజెప్పితివి.. గీ వయసుల ఎట్ల బతుకుతవురా'' అని అంటూవుంటే...
``మొదటి సంది గా భూమ్మీద బతికిన్నా... రెక్కల కష్టం మీద ఎల్లదీసినా.... నా రెక్కలు ఆధారం. అయినా గా భూమి మా భూమక్కదే...దానితోటే అచ్చింది దానితోటే పోతాంది. అది ఎక్కడ వుంటేంది భూమి దాన్దే'' అని మళ్లీ పాలేరు జీవితం మొదలుపెట్టాడు.
తన తండ్రి పరిస్థితి తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తన వల్ల పట్టిన అదృష్టాన్ని మళ్ళీ తనే దోచుకు పోతున్నట్టు అనిపించింది. కాని కాపురానికి పోక తప్పింది కాదు. పుట్టినింటినుండి మెట్టినింటికి కాలు పెట్టినా వేళావిశేషమేంటోగాని భూమక్క మొగుడు రాజీరు చేసినపనల్లా లుఖ్సాన్ కావట్టింది. అత్తగారింట్ల అందరూ భూమక్కను ఆడిపోసున్నారు. తిట్టపోసిండ్రు. తను పుడితే కల్సి వచ్చిందన్న తండ్రి గుర్తుకు వచ్చిండు. తనను ఎంత అపురూపంగా చూసుకున్నది, పెంచింది అంతా కళ్ళముందు తిరిగింది. మరి అదే అదృష్టం ఇక్కడ ఎందుకు కల్సిరాలేదో పాపం భూమక్కకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. పోనీ తన తల్లి దండ్రులైనా ప్రశాంతంగా వున్నారంటే అదీ లేదు...
తను అదృష్టవంతురాలు కాదనే నిర్ణయానికి వచ్చింది. రాజీరు బాగానే చూసుకునే వాడు. ఎవ్వరు ఏమన్న రాజీరు సాంగత్యంలో ఊరట చెందేది. తరువాత తప్పని పరిస్థితుల్లో పొలం పనులకు పోవల్సి వచ్చేది. ఇరుకు ఇంట్ల ఉండడం కన్నా విశాలంగా కనిపించే మైదానాల్లో ఉండడమే ఆమెకు ఇష్టం అనిపించేది చల్లని గాలి.. చెట్టు నీడ, .. బాయి నీళు్ళ కంకుల మీద వాలే పిట్టలు... పచ్చని పొలాలు ...ఎంతో నచ్చాయి. వాటిని చూస్తు కాలం గడిపెయ్యాలని పించేది మరి పనులు అయిష్టంగానే మొదలు పెట్టేది. ఈ పనులన్నీ పుట్టింటి దగ్గర నేర్చుకున్న పాపాన పోలేదు.
``భూమక్క ఇగో నేను పొలం పోతన్నా... ఇంటి ముంగట్నే ఆడుకో బిడ్డ...ఉట్టిమీద బువ్వ ఉన్నది. ఆకలి అయినప్పుడు తిను. పొద్దు అంగెటాల్లకు అత్తా'' అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళే తల్లి గుర్తుకువచ్చింది.
తోటి పిల్లలతో ఆడుకుందామన్న ఎవరు కనపించే వారు కాదు. ఏదో పనిమీద వెంట తీసుకొని వెళ్ళే వాళు్ళ `వ్యవసాయమంటే ఎందరున్న వొడువని పని' ఎన్నోసార్లు తన తల్లి నోటి నుండి విన్నది. ఇంటి దగ్గర ఉండే పిల్లలు కూడా తమకన్న చిన్న వాళ్ళను ఆడిస్తూ ఇంటిని కాపలా కాస్తూ వుండే వాళు్ళ . సాయంత్రం ఇంటికొచ్చేవేళకి పొయ్యి అంటించడం...ఇల్లు ఊడ్చడం లాంటివి పనులు చేసి పెట్టేవాళు్ళ. అలాంటి పనులన్నీ ఇంటికొచ్చిన తల్లే చేసుకునేది. చిన్నమెత్తు పని కూడా చేసేది కాదు. ఎన్నో పనులు చేసి ఇంత తిని పడుకుంటే వెంటనే నిద్రలోకి జారిపోయేవారు. మంచి నిద్రలో ఉన్నప్పడు ``అవ్వ...అవ్వ...'' అని తట్టిలేపింది. ఠక్కున లేచి ``ఏంది బిడ్డా... ఏంది...'' కంగారుగా అడిగేది తల్లి. ``ఒంటేల్గు అత్తాంది'' అంటే భద్రంగా బయటికి తీసికెళ్ళి తీసుకొచ్చి పడుకో బెట్టేది... చెయ్యి కాలు కడుపుమీద వేసుకొని కమ్మగా నిద్రపోయేది. ``భూమక్క...భూమక్క లేబిడ్డ తెల్లారింది...'' అని బ్రతిమాలి లేపేటోడు తండ్రి... అవన్నీ గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి పడి ఏడ్చేది భూమక్క .... ఎవ్వరు చూడకుండా ... బుగ్గ మీద చారికలు, కంట్లే తడి చూసి రాజీరు అడిగేటోడు ``ఏడ్సినావానే.... ఎందుకు ఏడ్సినవు''
``ఏం లేదు ఉట్టిగనే'' చెప్పేది.
`కన్నోళు్ళ యాదికచ్చిండ్రేమో' పాపం అని మనసులో అనుకునేటోడు. కొన్నొద్దులు పుట్టింటికి పంపాలె అనుకున్నాడు.
``అవ్వా... ఓ అవ్వా'' పిల్సిండు రాజీరు.
ఇల్లు అలుకుతున్న రాజీరు తల్లి.... ``ఏందిరా రాజీరు పిల్సినవా'' అడిగింది చేతులోని పిడసను ఆపి....
``ఔనే అవ్వా... అదీ రంధి వెట్టుకున్నట్టున్నది... కొన్నొద్దులు అవ్వగారింటికి పోతదటనే'' అన్నడు.
``ఏందిరో దానికన్న ఎక్కువ రంధి నీకున్నట్టున్నది... పనులు తీరకపాయే.... గిప్పుడు పంపుతే ఎట్లరా....మనుషూలేమో దొరకుతలేరాయే.....'' అంది.
``పనవ్వకున్న వడేత్తు....పని ఎప్పుడోవడుత్తాదానే... ఎన్నొద్దులకు పని వడువదిగని ... నాలుగొద్దులు పోయిరానితీయ్యి'' అని మరి మాట్లాడకుండా తువ్వాల భుజం మీద వేసుకుని బయటికి వెళ్ళి పోయాడు రాజీరు.
``పెండ్లామ్ బెల్లం అయ్యింది... పెయ్యి నొయ్యకుంట వుండే తందుకు మనమేమైనా దొరలమా...తినికూసుంటే అయితాదా? ఇంటింటి రాజులు పనిజేత్తేనే ఐదు ఏళు్ళ నోట్లోకి పోవుడు కట్టమైతాంది'''
అత్త సణుగుడు భూమక్క వింటూనే వున్నది. కన్న వారింటికి వెళ్ళడానికి కూడా తనకు స్వేచ్ఛ లేదని తెలిపోయింది'' పెండ్లి పాడుగాను గిన్ని కష్టాలుంటాయా, చేసుకోకుంటే ఏమైతది' అనిపించింది.
పనులు మీదుండి ఎడ్ల కచ్రం దొరకలేదు. అందుకనే భూమక్కను సైకిల్ మీద కూసోవెట్టుకొని పుట్టింటికాడ దించిండు. ``నాలుగొద్దులు వుండి మీ అయ్యను పడగొట్టుమను. ఇంటికాడ పనులు చూసినవ్ గదా! మా అవ్వ కోప్పడుతాంది.... మాల్లా నేను అచ్చుడంటే కలవది'' చెప్పి వెళ్ళిపోయాడు రాజీరు.
ఇక్కడున్న మాటేగాని వెళ్ళిన తరువాత అత్త ఎంత ఆడిపోసుకుంటదోనని ఒక్క తీర్గ రంధి పట్టుకున్నది. రెండొద్దులు అయినంక `ఏదైతె గదయిందని'' మనసు నిమ్మలం చేసుకున్నది.
సరిగ్గా పదిరోజులుండి వచ్చేసరికి ఇంటి దగ్గర బీభత్సం జరిగిపోయింది.
తండ్రిని తీసుకొని వాకిట్లోకి అడుగుపెడుతున్న భూమక్కకు బాయిమీద స్నానం చేస్తున్న రాజీరు కనిపించాడు. భార్యను చూడగానే రాజీరుకు ఎక్కడలేని సంతోషం వేసింది. బడబడ నాలుగు చెంబులు నీళు్ళ గుమ్మరించుకోని స్నానం ముగించి వచ్చాడు. ఇంటికి తాళం వేసి వుంది. అలాగే నిలబడి వున్నారు ఇద్దరూ.... ``గిటురాండ్రి మన యిల్లు ఇటు'' అని కొట్టంలోకి తీసికెళ్ళాడు రాజీరు.
``అయ్యో పాపం పాడుగాను...ఏమైంది'' కంగారుగా భర్తను అడిగింది భూమక్క.
``మన కర్మ గిట్లున్నది....'' అని గడంచే తెచ్చి వేసిండు. ``కూకో మావా'' అన్నాడు.
ఏమీ అర్థంగాక బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు భూమక్క తండ్రి. ``అప్పుకట్టలేదని ఇంట్లేకెయ్యి దొర ఎల్లగొట్టిండు. మనోళ్ళందరూ `దుబ్బపల్లి' మీదికి పోయిండ్రు...'' ఊరవతల ఇలా అన్ని పొగొట్టుకున్న వాళ్ళ అందరూ కలసి చిన్న చిన్న గుడిసెలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. దానికే దుబ్బపల్లి అని పేరు....
ఇగ మాయింట్ల కూడా వేరు పోసిండ్రు. ఎవ్వని బతుకువాడు బతుకమని రెండు గిన్నెలు, నాలుగు కంచాలు గిలాసాలు నాపాలుకు అచ్చినయ్ అవి యిచ్చిండ్రు. నాకే ఇల్లు ఇడువబుద్దికాలే. గీ కొట్టంల వుంట అంటే వుండుమన్నరు.'' దీనంగా చెప్పిండు రాజీరు. భూమక్క శోకమే పెట్టింది.
``ఊకోబిడ్డా ...ఊకో... మన కర్మల గిట్లున్నది. భయపడితే అయితాదా! మనసంటోళు్ళ రెక్కలను నమ్మి బతుకుడే... అయిసు పోరగాండ్లు మీరు. ఏమిట్లకు ఏం చూసిండ్రు ఉన్నదంతా ముంగటనే ఉన్నది. ధైర్నంగా వుండాలే....'' అని బుజ్జగించాడు.
``రాజీరు'' పిల్సిండు భూమక్క తండ్రి.
``ఏందే మామ'' అన్నడు రాజీరు.
``అయ్యిందేదో అయ్యింది. నేనొక ముచ్చట చెప్పుతా యింటవా బిడ్డా''
``నువు్వ నా చెడు కొరతావానే! ఏందో సెప్పు...''
``నువు్వ ఎట్ల ఒంటి అయినవ్...గింత నీడలేకుంట అయ్యింది. గీడవుండి ఏం జేత్తవ్ బిడ్డ. నాకు ఒక్కతే బిడ్డాయే. మేము ముసలోళ్ళం అయితిమి. ఇయ్యాల ఇంట్లే రేపు మంట్లే... నువ్వేం రంధి పడకు. నీకిచ్చిన అరఎకురంల అందరం చేసుకుందాం ఒక్క కాడ వుందాం... నాతోటి మా వూరికిరా. నాకు కొడుకు వున్నడనుకుంటా... ఒక్కనివి ఇక్కడ గోసపడుడెందుకు. సావుదలకు మాకండ్ల ముంగట వుందురు. ఉన్నదాంట్ల సేసుక బతుకుండ్రి బిడ్డ....'' అంతా చెప్పి ఏమంటావు అన్నట్లు రాజీరు వైపు సూసిండు.
భూమక్క కూడా మొగుడి వైపు చూసింది ఏమంటోడనని ``అవునే ఎప్పుడనంగా బయలెల్లిండ్రో...అన్నం అండుపో తిన్నంక మాట్లాడుకుందాం'' అంటూ ఆలోచనల్లో పడిపోయాడు రాజీరు.
ఆగమాగంగా వున్న కొట్టంల ఎక్కడ ఏమున్నయో చూసుకుంట మొగుడ్ని అడుక్కుంటా వంటకు ఉపక్రమించింది భూమక్క. ఇంతలో మూడు రాళు్ళ తీసుకొచ్చి పొయ్యి తయ్యారు చేసిండు రాజీరు.
పుల్లలు ఏరుకచ్చి పొయ్యి అంటించి ఎసరు పెట్టింది భూమక్క. పొగ కళ్ళను కప్పేసింది.
భర్త ఒక్కడే వస్తాడని ఎదురు చూస్తున్న భూమక్క తల్లికి, భూమక్కతోపాటు రాజీరును వెంటేసుకు వచ్చినందుకు ఒకవైపు ఆశ్చర్యపోతూనే `లోపలికి రమ్మని'' ఆహ్వానించింది.
మనసులో ఆందోళనగానే వుంది. విషయం విని కన్నీరు మున్నీరుగా విలపించింది. ముంచకపోయిందేమున్నది అందరూ కలిసే వుంటం అనుకునే సరికి ధైర్యం వచ్చింది. ఏం జరిగినా మన మంచికే అనుకున్నది.
భూమక్క తండ్రి ఎలాగైనా సరే అల్లుడిని బిడ్డని సుఖంగా బతికే మార్గాలు వెతకసాగేడు. సరిగ్గా అలాంటి సమయంలోనే కలిసిపనిచేసిన పాలేరు పర్వతాలు కనిపించిండు. తాటి చెట్ల కింద కూర్చుని కల్లుతాగుతున్న తనను చూసి గుర్తుపట్టి మరీ పలకరించాడు పర్వతాలు.
``బుచ్చన్న మంచిగున్నవానే'' అన్నడు.
తేరిపారి చూసి ``ఓస్నీయక్క పర్వతాలు నువ్వారా... ఎట్లున్నవురా. పురాగా కనిపిత్తలేవు్వ. ఊల్లే ఉంటలేవురా'' అని అడిగిండు.
``ఊల్లే మన్నుబుక్క ఉండాల్నా... నా కొడుకు బాయిపని జేత్తాండు. చేసిన కాడికి మా సాలు ఇంటిపట్టునే వుండమన్నడు నా కొడుకు. మూడుపూటలు తినుడు. తాగాలని పిత్తే తాగుడు రంధి లేకుంట వుంటాన్నే బుచ్చన్న. చేసి చేసి చేతులన్నీ పాయేగాని బతుకులు మారకపాయే పాలేరు కొడుకు పాలేరు. దొరకొడుకు దొర అయితాండు. థూ... నీ యవ్వ గీ బతుకు నా కొడుకు బతకద్దు అనుకున్న కాలేరు మీదున్న మా సుట్టపోన్నీ పట్టుకుని పైరవీ పెట్టిచ్చి బొగ్గుబాయిల పని దొరకవట్టినా. నేను ఊరిడిసిపెట్టి రెండేండ్లు ఎల్లిపాయే గదనే బుచ్చన్న. మా తము్మని బిడ్డ పెద్దమనిషి అయ్యిందంటే పేరంటానికి అచ్చిన... కాలేరు మీద కల్లు దొరుకుతాదే... అందుకే నాలుక పీకుతాందని తాళ్ళకచ్చిన. దేవునోలే కనిపిచ్చినవు'' అడకగముందే అన్నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టయ్యింది బుచ్చన్నకు.
``ఔరా పర్వాతాలు కాలేరు (బస్తీ) మీదికి మల్లా ఎప్పుడు పోతాన్నావురా?'' అడిగిండు బుచ్చన్న.
``రేపు పోదామనుకుంటాన్ననే'' చెప్పిండు కల్లుతాగిన ఆకును పక్కనబెట్టి మూతికి అంటిన కల్లు నురుగును తుడుసుకుంటూ.
``ఏందే బుచ్చన్న పిల్లవట్టిన కోడోలే వున్నవ్'' అని అడిగిండు
``నిజంగ గట్లేనే ఉన్నదిరా పర్వాతాలు...' అంతా చెప్పుకుంటూవచ్చాడు.
``అయితే అల్లుడు యిల్లుటం అచ్చిండానే''
``దీన్ని ఇల్లుటం అంటార్రా!.. మా సరేగని నాకు కొంత సహాయం చెయ్యకపోతివి'' అన్నడు బుచ్చన్న.
``ఏందే బుచ్చన్న గట్లంటవ్...నువు్వడిగితే కాదంటన్నా''
``మా అల్లునికి సుత బాయిపని సూడు. ఊల్లే మింగరాకుండా, కక్కరాకుంటా ఉన్నది. పైరవీ పెట్టియి పైసలు వెడుదాం'' అన్నడు.
``గింతగనం చెప్పాన్నే...నీ బిడ్డ నా బిడ్డగాదా. నీ అల్లుడు నా అల్లుడు కాదా'' అన్నడు భరోసా యిస్తు.
భభూమక్క, రాజీరు కాలేరు మీదికి అచ్చిండ్రు. ఉన్న భూమి అమ్మి పైసలు పైరవికి పెట్టి ఆర్నెల్ల లోపలన్నే బాయిపని దొరికిచ్చుకున్నడు రాజీరు.
మొదటి రోజు ట్రైనింగ్‌కు వెళ్ళిన రాజీరు బొగ్గుగనిలోకి దిగుతుంటే మళ్ళీ బ్రతికి బయటకి వస్తానా? అన్న అనుమానం వచ్చింది. తన బతుకు తీర్గ లోపలంతా చిమ్మని చీకటి అనిపించింది. ``ఈ బాయిపని పాడుగాను నాతోని గాదే...నీ బాంచెన్ భూమి కడుపులకు పొయ్యి అత్తాంటే మీదికి ఎక్కెదాక పానం అగులుబుగులు అయితాంది'' అని భూమక్కకు చెప్పేవాడు.
భూమక్క బుదరకిచ్చి (బ్రతిమాలి) పనిలోకి పంపిస్తోంది. కిందమీద పడుతూ పనికి పోయివస్తున్నాడు. అన్నిట్ని అలవాటు చేసుకుంటున్నాడు. ఇక్కడ అన్ని కొత్తగానే ఉన్నాయి. కొత్త ఊరు, కొత్త అలవాట్లు. ఊల్లోనుంచి వచ్చిన అలవాట్లాను వదలలేక కొత్తవాటిని కాదనలేక కుడితిలో పడ్డ ఎలుక పరిస్థితిలా వుండేది. ఎన్ని కష్టాలు పడ్డ నెల తిరిగే సరికి చేతిలో పడ్డ జీతం చూసేసరికి అన్నీ మరిచిపోయేలా చేసేది.
రాజీరు అత్తమామలను కూడా వచ్చి తమతో పాటే వుండమని చెప్పాడు. కాని ``అద్దు రాజీరు. మేము ఎన్నొద్దులు బతుకుతం గీ కాలేరు పాడుగాను. ఊల్లే ఉన్నట్లు ఉంటదా? బల్మీటికి అచ్చిన ఉండుడు కట్టం'' అని చెప్పిండు బుచ్చన్న.
``ఇల్లు చిన్నగున్నది. ఏదో గింత నీడ ఉంటదని రెండు గుంజలు పాతి గుడిసె ఏసుకున్న. ఔనే మల్లన్న కంపెనీల పని చేసేటోళ్ళకు ఇండ్లు ఇత్తరట నిజమేనానే'' తోటి ఉద్యోగిని అడిగిండు రాజీరు.
``వీని యిచ్చుడు మొకంల సెప్పు. వాడు మనకు ఇండ్లు ఇయ్యాలే. కరెంటు ఇయ్యాలే తాగేతందుకు నీళ్ళ సౌలతి జెయ్యాలే. కని చేత్తలేడు. దోసుకునుడు...దోసుకునుడు. అడిగేటోడు లేడు. వాడు మనకు ఇయ్యడు.
``గదేందే మల్లన్న గట్లంటవ్ ...కొంతమందికి ఇండ్లు ఉన్నయిగదనే''
``లం...సీనియారిటీని వట్టి ఇండ్లు ఇత్తరట. ఎవనికిచ్చిండ్రో. ఎవనికియ్యలేదో.... బతకచ్చినం ఆగం బతుకులు బతుకుతున్నం ఏడ జాగుంటేే గాడ గింత గుడిసే ఏసుకొని వుండాలే...' తనకు తెలిసిన మేర బండబూతులు తిడుతూ విషయం వివరించాడు.
రాజీరుకి ఒక్కటి మాత్రం అర్థంమయ్యింది. తనకు కంపెనీ క్వాటరు రావడం కల్ల అని తెలిసిపోయింది. పెనం మీదునుంచి పొయ్యిల వడ్డట్టున్నది. ఉన్న గుడిసెను కాపాడు కుంటూ బతకాల్సిందే. ఊల్లో కొట్టం గుడిసె ఒక్కలాగే తోచింది.
రాజీరుకు కొడుకు పుట్టాడు. అత్తమామలు ఇద్దరూ కాలగర్భంలో కలిసి పోయారు. ఇక తనవాళ్ళగురించి ఆలోచించే అవకాశం లేకపోయింది రాజీరుకి.
రాజీరుకు భూమక్క, భూమక్కకు రాజీరు మిగిలారు. వీళ్ళకి గుర్తుగా కొడుకు శంకర్ వున్నాడు. చదువుకోక పోవడం వల్ల తమ బతుకులు హీనంగా వున్నాయని కొడుకును బాగా చదివించాలని నిర్ణయించుకున్నాడు రాజీరు! భూమక్కకు కూడా తాము చదువులేకనే ఇలా బతుకుతున్నామని గాఢంగా నమ్మింది . శంకర్‌ని చక్కగా చదివించాలన్న నిర్ణయానికి సంతోషం వ్యక్తం చేసింది. పొద్దున్నే వాడిని తయారు చేసి బడికి పంపించడమంటే చాలా ఇష్టమైన పని. క్రమం తప్పకుండా ఆ పని చేసేది కూడా.
పాపం రాజీరు పరిస్థితే రాను రాను హీనంగా మారిపోయింది. బొగ్గుగనిలోని వాతావరణం పడక ఆరోగ్యం చెడిపోయింది. కళు్ళ పీక్కుపోయి, ఒళ్లంతా దద్దర్లు తేలి, ఒంట్లో బొక్కలు బయటికి పొడుచుకు వచ్చాయి. డాక్టర్ల చుట్టూ తిరగడం నిత్య కృత్యం అయిపోయింది రాజీరుకు. అతి కష్టం మీద పనికెళు్ళతున్నాడు.
తిన్న అన్నం అరగక పనికెళ్ళి వచ్చిన తరువాత ఎన్నోసార్లు కక్కుకున్నాడు. కంట్లో నీళు్ళ నింపుకోవడం తప్ప భూమక్కకు ఏం చెయ్యాలో తోచలేదు. కొడుకు శంకర్ పెరిగి చేతికి అందివస్తాడనుకుంటే. చెడు సావాసాలు చేసి అన్ని వ్యసనాలకు బానిసయ్యాడు. పోలీసులు తీసికెళ్ళి నాలుగు రోజులు ఉంచుకుని పంపించేవరకు వచ్చింది. చిన్న చిన్న నేరాలు పెద్దవాటికి దారితీస్తూ అటే వెళ్ళి పోయాడు. ఇంటికి రావడం కూడా తగ్గించేశాడు. భూమక్క ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. కనీసం కొడుకు కళ్ళముందుంటే చాలు అనుకుంటే. వీడు చేసే పనులుకు పోలీసులు ఇంటిదాకా వచ్చి సతాయించే వారు. దీనికన్నా వాడు రాకున్న పర్వాలేదు అనుకునే పరిస్థితి దాపురించింది. అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుండే వాడు శంకర్.
రాజీరు మంచం పట్టేశాడు. చిన్న పిల్లాడికి మల్లే అన్నీ చేయవలసి వస్తోంది. కణేల్ కణేల్ మని ప్రాణాలు పోయేలా దగ్గేవాడు. `యాక్ థూ' అని ఉమ్మివేస్తే దాన్నిండా నల్లటి బొగ్గుతో కూడిన లాలాజలం వచ్చేది. అంటే రాజీరు ఆరోగ్యాన్ని బొగ్గు ఎలా తినేసిందో తెలుస్తుంది.
ఒక రోజు విపరీతంగా దగ్గుతూనే ప్రాణాలు కక్కేశాడు రాజీరు. కర్మ చేయడానికి శంకర్ కూడా రాలేదు. ఎక్కడున్నాడో తెలియదు. తన చేతుల తోనే కర్మకాండ పూర్తి చేసింది. అప్పుటినుంచి పాపం భూమక్క ఒంటరిదైపోయింది. ఆ గుడిసే తనకు సర్వస్వం. పాపం గుడిసెకు కూడా భూమక్క తప్ప ఎవరులేరు.
రోజులు గడస్తున్నాయి.
ఉన్నట్టుండి ఒకరోజు హడావుడి మొదలయ్యింది. భూమక్కకు ఏమీ అర్థం కాలేదు. అందరూ గుంపులు గుంపులుగా మాట్లాడుకోవడం కనిపించింది. ఒక రోజు ఎకాఎకిన అందరూ తట్టా బుట్టా చేత పట్టుకుని ఇండ్లు ఖాళీ చేయడం కనిపించింది.
``ఏందీ బిడ్డ అందరూ ఇండ్లు ఇడిసి పెడుతున్నరు'' అని అడిగింది ఒకర్నీ. ``అయ్యో పెద్దవ్వ నీకు ఎరకలేదానే.... బాయిలు అన్నీకూలగొడుతాండ్రు. ఓపెన్‌కాస్‌టలని చేత్తాండ్రు. ఊళ్ళకు ఊళు్ల తవ్వటం బెడుతాండ్రు. ఇండ్లు ఖాళీ జెయ్యాలనీ చెప్పిండ్రు. నువు్వ సుత మీ ఊరు ఎల్లిపో. ఈడ ఎక్కడుంటవ్'' తనకు తెలిసిన మేరకు చెప్పాడు అతను.
``చిత్రం పాడుగాను ఊళు్ళ కూలగొడతరా! ఊరంటే మాటలా... ఊరును పాడు చేసే బుద్ది ఎవ్వనికి పుట్టింది. మనుషూల తిట్టుకుంటా కొద్ది దూరం నడిసిపొయ్యి చూసింది.
హిరణ్యకశువుడు మాట యినకుంటే నరసింహా స్వామి పట్టి పొట్టచీల్చినట్టుగా వుంది ఆ దృశ్యం. గుట్టల గుట్టలుగా మట్టి మేటు వేసివుంది. భూమి మొత్తం తవు్వతున్న మిషన్లు చప్పుడు చేస్తున్నాయి. లారీలు కిందికి మీదికి తిరుగుతున్నాయ్. మనుషూలు కనిపించలేదు. అన్ని యంత్రాలు తిరుగుతున్నాయి. దూరం నుండి చూస్తే గాలిలో ఎగురుతున్న దువ్వెనల మాదిరిగా కనిపించాయి భూమక్కకు. ఊళ్ళకు ఊళు్ల తుడిచిపెట్టుకు పోతున్నాయి. విలువైన బొగ్గు బయటకు పోతోంది. ఇక్కడి జీవితాలను పట్టించుకున్న నాథుడులేడు. వాటి లాభాలు ఎవ్వరు అనుభవిస్తున్నారో అర్థం కాలేదు. భూమక్కకు మొదటిసారి భయం వేసింది. ఇంతటి విధ్వంసం ఎందుకు చేస్తున్నారో ఆమె బురక్రు అందలేదు. మెల్లిగా గుడిసె ముందుకు నడిచి వచ్చింది. కలియ జూసింది. లోపలికెళ్ళి మంచం మీద పడుకున్న భూమక్కకు కండ్లనుండి నీళు్ళ ధారగా కారుతున్నాయి. తలుపు సప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా జవానులు ``ముసలమ్మ ఇది ఖాళీ చేసి ఎటన్న పో. ఇవన్నీ కూలగొడుతున్నం'' చెప్పిండు.
తనకు ఎవరున్నారు. ఎక్కడికని వెళు్తంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
చుట్టూ చూసింది. అందరు సామానులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు చీమల గుంపుమాదిరిగా....
``ముసలమ్మ నీకే చెప్పేది. ఎటన్న పో'' మళ్ళీ గద్దించాడు జవాను.
భూమక్కకు ఎక్కడలేని కోపం అచ్చింది.
``లం... లారా మీ అయ్య జాగీరా! కూలగొడతం అంటాండ్రు. ఊరు మీరు పొందిచ్చిండ్రా! ఎక్కనుంచి అచ్చిండ్రు మీరు. మము్మల ఎల్లగొడతం అంటార్రు. ఏడ గింత నిమ్మలంగా బ్రతకనియ్యరా! మీ కడుపుకాలిపోను. మీ మొకం బోర్లెయ్యా! మీ పెండ్లాలు ముండమొయ్య'' రెండు చేతులు చాపి మట్టి తీసి దుమ్మెత్తి పోసి శపించింది.
దెబ్బకు దడుసుకున్న జవాను వెనక్కి పరిగెత్తాడు. ``సార్... అందులో ముసలమ్మ ఉన్నది ఖాళీ చెయ్యమంటే చెయ్యనని తిడుతోంది...'' చెప్పాడు పై అధికారితో...
`వెళ్ళి సామాన్లు బయటకు పారెయ్యండీ! అదే పోతుంది'' హుకుం జారీ చేశాడు. ముందుకు అడుగు వేస్తున్న జవానులు అవాక్కయ్యారు. కొంగు బొడ్లోకి దోపి చేతి కరత్రో రండిరా చూసుకుందాం అన్నట్లుగా నిలబడి వుంది.
``రాండ్రీ మిము్మల బొందవెడుతా'' గట్టిగా అరుస్తోంది భూమక్క.
సామానులు పట్టుకుని వెళు్తన్న వారంతా ఈ గొడవకి వెనక్కి తిరిగి చూసి భూమక్క వైపు వస్తున్నారు.
నోరెళ్ళబెట్టి చూస్తున్నారు జవానులు.
''సార్ ఏం చేద్దాం'' అని జవాను పై అధికారిని అడుగుతున్నాడు.
...
Sunday, 27 December 2009
Subscribe to:
Post Comments (Atom)


0 comments:
Post a Comment